www.theTelugus.com

పదిహేడేళ్ళ వయసులో కలం కార్మికుడిగా ఒక ఇంగ్లీషు దిన పత్రికలో చేరినప్పడు పత్రికా వ్యవసాయం లోని అన్ని కిటుకులూ తెలుసుకోవాలన్న తపన ఉండేది. ఇప్పటి రోజుల లాగ విశేషజ్ఞుడిసై తక్కువ కన్నా తక్కువ విషయాలమీద ఎక్కువ కన్నా ఎక్కువ తెలసుకుని ఏమీ కాని విషయంలో ఆంతా తెలిసిన (specialist who knows everything about nothing) కాక విలేఖరినైనా చేతి కంపోసింగ్ నుంచీ సబ్ ఎడీటింగ్ వరకు అన్ని శాఖల లోనూ నైపుణ్యం సంపాదించడానికి. రిపోర్టర్ పని ముగిసాక, జీతం లేకుండా చాకరీ చెయ్యడం అలవాటయింది..

అది 1950ల ఆఖరు సమయం. ఒక రాత్రి రెండు గంటలకి ఒక వార్త teleprinter (ఆరోజుల్లో వార్తలు అలాగే వచ్చేవి) మీద వచ్చింది, ‘Gama dies in penury’ ఆని. అప్పుడు పని చేస్తున్నది ఇద్దరమే. టికేకర్ ఆనే రెడో సబ్ (సహసంపాదకుడు) అడిగేడు ‘ఈ పెన్యురీ ఎక్కడుంది?’ అని. నేను నవ్వి చెప్పను‌, ‘పెన్యురీ అంటే లేమి. అది పట్నం కాదు”– అప్పడు, ఆతనికొక ఊహ వచ్చింది ఎప్పుడేనా ఈ వ్రృత్తి గురించి పుస్తకం రాస్తే ‘పెన్యురీ అనే పట్నంలో” అని పేరు పెట్టొచ్చు అని.

ఒక అర్ధ శతాబ్దం తరువాత ఈ వ్యవసాయం లో ఇన్ని ఏళ్ళలో వఛ్చిన మార్పుల గురించి రాద్దామని అనుకుని ‘ A Town Called Penury- the Changing Culture of Indian Journalism’ అన్న పుస్తకం రాసేను… పత్రకారులు ఎవరూ మరొకరు రాసినది చదవరనీ, చాలా మంది ఏమీ చదవరని తెలియక.

ఒకప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో భాగమై‌, ఆదర్శ వాదులు మాత్రమే పనిచేసే ఈ వ్యవసాయంలో ఇప్పడు 80% డబ్బు కోసం మాత్రమే పనిచేసి‌ అసత్య వార్తలకీ‌, డబ్బు తీసుకుని కోట్లు గణించే వారికీ నిలయం అనీ అప్పడు తెలియదు. ఎన్నో వేలమందికి సందేశాలు పంపినా ఒక పత్రకర్త కూడా దానిమీద అభిప్రాయం చెప్ప లేదు. కన్నడ లోకి తర్జుమా ఐ ‘పెన్యురీ ఎంబ పట్టణ’ పేరుతో ప్రచురింపబడినా తెలుగు లోకి అనువదిస్తానని అన్న వ్యక్తి మొహం చాటేస్తాడని ఊహించ లేదు.

ఇప్పటి వ్యవస్థలో “పంతులుగారు రానీ‌ జీతాలడుగుదాం” అని ప్రకాశం గారి కోసం ఎదురు చూసి అతని దిగులు ముఖం చూశాక అడగని ‘తెలుగు స్వతంత్ర’ సిబ్బంది, వారి పేదరికం గురించి హేళన మాత్రమే చూస్తారు-

ఇదీ‌ ఈ రంగంలో వచ్చిన మార్పు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here