PC -theTelugus team

‘‘ఇంగ్లీషులో ఒక నుడి ఉంది:  “మొదటినుంచి మొదలెడదాం” అని (Let us begin at the beginning). 63 ఏళ్లకింద మొట్ట మొదట కలంకార్మికుడిగా  పని మొదలెట్టాను. ఆకాలంలో పత్రికలలో పని చేసేవారికి జీతాలు చాలా తక్కువ ఉండేవి  అనీ, రాయడం అంటేవున్న  దురదకి ‘అభివ్యక్తి  స్వాతంత్ర్యం’  అనే గొప్ప పేరుపెట్టి  చాలామంది ఈ వృత్తి లో  (కొందరు గతిలేక, మరేమీ దొరక్క)  ప్రవేశిస్తారనీ నాకు తెలుసు. రాష్ట్రేతర  ఆంధ్రుడిగా నాకు తెలుగు నేర్చుకోడానికి సాయం చేసినది తెలుగు పత్రికలే. కాబట్టి ఇప్పటికీ దొరికిన తెలుగు  పత్రికలన్నీ చదువుతూ ఉంటాను.

నేను వృత్తిలో ప్రవేశించిన కొన్నేళ్లకి  పత్రకర్తల్ని  మభ్యపెట్టి మంచిచేసుకోవాలనో, నిజంగా వారి దుస్థితి గ్రహించో, కేంద్రప్రభుత్వం వేతన సంఘాలు (wage boards) నియమించడం మొదలెట్టింది. వారు నిశ్చయించిన  వేతనాలు అమలు జరపడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల పని. అంటే తెలంగాణాలో  పత్రికలు సరిగ్గా జీతాలు ఇవ్వాలని నిర్త్బంధించడం మీ బాధ్యత.

గుజరాతులో  మొట్ట మొదటి ఇంగ్లీషు దినపత్రిక 1967 లో నేను ప్రారంభిOచినప్పుడు నరేంద్ర మోదీ పేరు ఎవరూ  వినలేదు. కానీ అతను పాతిక సంవత్సరాలకన్నా ఎక్కువే ప్రజారంగం లో ఉన్నారు. ఇప్పుడు అతని పేరు తెలియని వారు ఒక్క తెలుగు పత్రకారులు మాత్రమే.  ఇప్పుడు  తెలుగు పత్రికలలో  పనిచేస్తున్న డింకార్లు, డినేషులూ,  డివకర్లూ  చంటిపిల్లలుగా ఉన్న రోజులనుంచి అతను పదవులలో  ఉన్నారు. కాని  ఇంగ్లీషు మోజువల్ల తెలుగు  పత్రికలు మాత్రం అతని పేరు ‘మోడీ’  అనే రాస్తున్నారు. దేశంలో చంటిపిల్లలకీ తెలిసిన ప్రధాని పేరు వారికి తెలియదు.కారణం వారు అతిచవక  అయిన  రేడియోలు  కూడా  కొనుక్కోలేని దుస్థితి లో  ఉన్నారనిపిస్తున్నది. ఇంగ్లీషులో  ‘మోదీ’  ఇంకా   ‘మోడి’  ఒకేలాగ రాస్తారు కాబట్టి వారు ‘మోడి’   అనే రాస్తున్నారు, కనీసం  రేడియో   విన్నా  వారికి  తమ తప్పు తెలిసే  ఉండేది.

కొందరికి తెలిసి కూడా  ఫేషన్ కోసం అలా రాస్తున్నారేమో. ఎందరికో నేను  ఈమేల్ లేక SMS పంపించాను, కాని  వారు  తప్పు దిద్దుకోడంలేదు.  ఈ మధ్యనే ప్రముఖ ప్రవర్తన కర్త చాగంటి కోటేశ్వర రావు గారు గోదావరిని  ఇంగ్లీషు accent  తో ‘గొడావృ’ అనే తెలుగువాళ్ళ  గురించి మాట్లాడేరు. అది వీరికే వర్తిస్తుంది. ప్రవాసాంధ్రుడిగా  నేను తెలుగుకాక, మరాఠీ, గుజరాతీ, హింది, కన్నడ పత్రికలని కూడా చదువుతాను. ఎవరూ  ప్రధాని పేరు ‘మోడీ’  అని రాయరు.  అందరికీ తెలిసినా తెలుగు పత్రకారులకి మాత్రం తెలియదు.

మీ పేరు చంద్రశేఖర రావు  అని  ‘చండ్రశే  ఖర   రాఓ’  కాదని వారికెలా  తెలుసు? ఇంగ్లీషు  ఉచ్చారణ  ప్రకారం అలాగే  తెలుగులో రాయాలి కదా?

ఖరం అంటే గాడిద అని వారికి తెలుసు కానీ మోడి అన్నది పాత  మరాఠీ  లిపి పేరని  వారికి తెలియదు. చండ్రశే  ఖర   రాఓ  గారూ, దయ ఉంచి  తెలుగు పత్రికల్లో పనిచేస్తున్నవారికి  రేడియొలు  కొని పెడతారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here