Photo Credit: news.tirumala.org

సరస్వతీ కటాక్షం+ గొప్ప జ్ఞాపక శక్తి = చాగoటి కోటేశ్వరరావు

By జి.సంజీవి

తెలుగులో ప్రవచనకారులనగానే మనసుకి తట్టే మొదటిపేరు చాగంటి కోటేశ్వరరావుగారు  గారిది.  బూటకపు  బాబాలు,  దొంగ ధర్మగురువులూ  కోట్లరూపాయలు పోగు చేసుకుని కుకర్మలు  ఆచరించే  ఈరోజుల్లో ఇలాటి  నిస్స్వార్ధంగా  మంచిని  ప్రోత్సాహించేవారు  చాలా అరుదు. మరాఠీలో కీర్తనకారులు (బాల్ థాకరే తండ్రి, ఇప్పటి  మహారాష్ట్ర  ముఖ్యమంత్రి  ఉద్ధవ్  తాతగారు దీనికి ప్రసీద్ధి), తెలుగులో హరికధలు  చెప్పేవారూ ఒకప్పుడు చాలా గౌరవింప బడే వారు.  ఇప్పుడు రెండూ చాలా అరుదే. హరికధ రమారమి అంతరించిపోయినట్లే.

ఒక కంపెనీ  MD  తనకింద పనిచేసే ఒక సాధారణ  ఉద్యోగి  కనీపిస్తే  వంగి   కాళ్ళు  ముట్టుకోడం చాలా ఆశ్చర్యకరం. ఆ కంపెనీ Food Corporation of India, ఆ ఉద్యోగి  చాగంటి కోటేశ్వరరావుగారు.

చాగంటి  ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఆయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. (ఆషాడ శుద్ధ నవమి)1959 జూలై 14వ తేదిన ఆయన జన్మించారు. కోటేశ్వరరావు గారి సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు.  ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు. ఇంగ్లీషులో ఒక rock starని  వినడానికి  ఎలా  తండోపాతండాలుగా   ప్రేక్షకులు వస్తారో అలా ఇతన్ని వినడానికి  వస్తారు. పిచ్చి అరుపులు సినిమా  పాటలుగా  చెలామణి అవుతున్న ఈ రోజుల్లో ఇది చాలా గొప్ప  విషయం.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేస్తున్నారు.  అతను ఖ్యాతి ఎలా  గడించారో అలాగే కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. అతనికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి అతను విద్యాబుద్ధులు వికసించాయి. అతను యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు. అతని ధారణాశక్తి గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం అతను మదిలో నిలిచిపోతుంది.  ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.

ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. అతని స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. ఇప్పుడుకూడా  పై ప్రదేశాలలో  ప్రవచనాలు చెప్పడానికి వెళ్లినప్పుడు  IInd  AC టికెట్లు తనకీ తన సహధర్మచారినీకీ స్వంత ఖర్చు మీద తనే కొంటారు.

పీ వీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. “మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను” అన్నారు పీవీ.  చాగంటి వారు నవ్వేసి “మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు.” అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారట.

అతను బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.

కోటేశ్వర రావుగారు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము బాల కాండ నుండి పట్టాభిషేకము  వరకు, శివ పురాణములోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతము లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృష్ణావతారం యొక్కపూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారాస్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల  విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు గారు అతను తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు.

 చాగంటివారికి శారదా జ్ఞాన పుత్ర, ప్రవచన చక్రవర్తి, బిరుదులు లభించాయి.  కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావు గారిని నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బహుకరించారు.

మన దేశంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ తిరుపతి సంస్కృత విద్యాపీఠం వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన వాచస్పతి (సాహిత్యంలో డాక్టరేట్) పట్టాను ప్రధానం చేశారు. డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్,‌ ఆ ఫౌండేషన్‌ 26వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయనకు పిన్నమనేని పురస్కారం అందజేసారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసీన రోజుల్లో. చాగంటివారు ఆఫీసుకు సాధారణంగా సెలవు పెట్టేవారు కాదు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోలేదు.   ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. ప్రవచనాలకు అతను పారితోషికం తీసుకోకపోవడమే కాక ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే తన సొంత డబ్బుతో టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు – నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకోరు. ఇంతవరకు అతనికి కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్ళేవారు.

అతని పేరు  కోటేశ్వర రావు  అయినా  ధర్మాన్ని అమ్ముకుని అతను  కోటేశ్వరుడు  అవలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here