లోకులు కాకులా?
ఈ మధ్య నాకెవరో తెలుగులో ఒక కథ పంపేరు.. అందులో మూడేళ్ళు జబ్బుపడి చనిపోయిన ఒక మనిషి కొడుకు (పీడవిరగడ అయ్యిందని లోపల సంతోషించినా) లోకం కోసం అతనికి కర్మ చేసి పిండం కాకులకి పెడితే ఎన్నో కాకులు కొద్ది దూరం లోనే ఉన్నా ఒకటికూడా తినడానికి రాలేదుట. అప్పుడు బంధువులలో ఒకరు జోక్ వేస్తాడు: “ఇంకేం కాకులూ? అందరూ లోకులు ఐపోయేరుగా” అని.
‘లోకులు కాకులై కూస్తారు’ అనే లోకోక్తి తెలియని తెలుగువారుండరు – తెలుగు చదవడం రానివారిలోకూడా. చాలా పనులు మనం లోకులు ఏమనుకుంటారో అని మాత్రం చేస్తాం… వాటి అర్దం, వెనకనున్న కారణం తెలియక పోయినా. కొన్ని పూజలు, కర్మకాండలూ ఇలాటివే. ఇలాటి చాలా విధులు అవి పుట్టిన సమయంలో ఎంతో relevant ఐనా ఈ మారిపోయిన నేపథ్యం లో అర్ధ రహితం, అనవసరం అవొచ్చు. కాని వాటిని ‘లోకులు ఏమనుకుంటారో’ ‘ అని మాత్రం చేస్తూ ఉంటాము — అవి మనకు కానీ ఆ కాకులకీ, లోకులకీ కానీ తెలయక పోయినా.
అలాగే ఈ కాకుల గురించి చాలా నమ్మకాలున్నాయి. ‘ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలదు’ అంటే రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం లోకులకే కాక కాకులకి కూడా తెలిసిపోయిందన్నమాట. పావురాల లాగే ఉపయోగించి కాకితో కబురు పంపించినా వస్తామంటారు. కాకి తపాలాశాఖలో కూడా పనిచేసేదేమో… ఇంటిమీద కాకి అరిస్తే ఉత్తరం వస్తుందనేవారు. కాకి కబుర్లు ఆంటే ఉట్టి కట్టుకథలన్నమాట.
కాకి భాష ఒక్క తెలుగే కాదు. ‘ఝూట్ బోలే కవ్వా కాటే’ ఆనే హిందీ పాట ఒకప్పుడు చాలా ప్రచారంలో ఉండేది. ఇంగ్లీషు లో రోడ్ మీదకాక అసలు దూరానికి ‘as the crow flies’ అంటారు. అలాగే కాకి అన్ని భాషలలోనూ చోటు చేసుకుంది. కాకి మన ప్రపంచంలో చాలా కుళ్ళు సాఫ్ చేసి మనకి scavengerగా ఎంత ఉపయోగపడుతుందో పిచుకల్లా కాకులు కూడా మాయం ఆయిపోతేనే తెలుస్తుంది. అప్పటికి ప్రపంచం వినాశానికి చాలా దగ్గర అవుతుంది.