శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్
దేశమంతా ప్రసిధ్ధికెక్కిన తెలుగు నాయకులలో అగ్రగణ్యులు దుర్గాబాయి దేశముఖ్.
శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ గారి జన్మదినం 1909 జులై 15. ఆమె ఆ కాలం లో హిందీ భాష దక్షిణ హిందీ ప్రచార సభ ద్వారా నేర్చుకున్నారు. చదువులో చాలా చురుకుగా ఉండే దుర్గాబాయమ్మ హిందీ భాష తోటివారికి కూడా నేర్పుతుండేవారు.
గాంధీ గారు ఆంధ్రరాష్ట్ర పర్యటనకు విరాళాల సేకరణకు కాకినాడ వచ్చినపుడు ఆయన ప్రసంగాన్ని తెలుగులో ఎవరు అనువదిస్తారు అంటే దుర్గాబాయమ్మ పేరు చెప్పారట.ఆవిడ చేసిన అనువాదానికి గాంధీ జీ ఎంతో సంతోషించారట.అలాగే ఆవిడ విరాళాలు కూడా సేకరించి ఇచ్చారట. దుర్గా బాయి గారు గాంధీజీ అడిగితే తన చేతి బంగారు గాజులు కూడా ఇచ్చేసారట.
గాంధీజీ ప్రియ శిష్యురాలి హోదా సంపాదించిన దుర్గాబాయమ్మ కాకినాడలో 1923లో జరిగిన కాంగ్రెసు మహాసభలకు టికెట్టు లేకుండా వచ్చిన జవాహర్లాల్ నెహ్రూ గారిని వెనక్కి పంపారట. ఆవిడ ఎవరన్నా భయపడేవారు కాదు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటూనే ఎం.ఏ. చదివి న్యాయవాది కూడా అయ్యారు.ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించారు.
దుర్గాబాయమ్మ ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. హైదరాబాద్ లో ఇప్పటికీ పనిచేసే ఆసంస్థ పేరుతోనే ఆవీధిని పిలుస్తారు.అక్కడ వితంతువులకు,అనాధ స్త్రీలకు చదువు చెప్పించడం,రకరకాల పనులలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ళమీద వారు నిలబడేటట్లుగా తయారు చేసేవారు. లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్నికూడా స్థాపించారు. నర్సింగ్ కాలేజీ లను స్థాపించారు. ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించారు.
స్వాతంత్రం వచ్చిన తరువాత ప్లానింగ్ కమిషన్ మెంబరుగా పనిచేశారు.ఆ కమిషన్లో పనిచేసిన శ్రీ చింతామణి దేశముఖ్ గారితో దుర్గాబాయి గారి వివాహం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ కు గౌరవ డాక్టరేటును 1971 లో ప్రదానం చేశారు. మొదటి భార్య మరణాంతరం అతను దుర్గాబాయిని వివాహం చేసుకున్నారు. అతను మహారాష్ట్రకి చెందినవారు. ఆ రోజుల్లో ఇలాటి అంతర రాష్ట్రీయ వివాహాలు చాలా అరుదు.
ఆమె స్త్రీల అభివృధ్ధికోసం చాలా కృషి చేసారు.సాక్షారతా భవనాన్ని స్థాపించారు.కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ వారు దుర్గాబాయి దేశముఖ్ అవార్డును మహిళా సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటు పడే వారికి ఇస్తారు.పదవులకోసం ఆశించక సంక్షేమ కార్యక్రమాలలోనే జీవితం గడిపిన ఆమె 1981 మే 9 వ తేదీన స్వర్గస్థులయ్యారు.
మనదేశ స్వతoత్రతా సమరంలో ముఖ్యులైన మహిళా నాయకులలో ఆవిడ ఒకరు.దయచేసి “ఆవిడ ఏ సినిమాలో నటించారు” అని అడిగి మీ తెలుగుతనాన్ని నిరూపించుకోకండి.