మాలతీ చందూర్
కృష్ణా జిల్లా నూజివీడులో 1930లో పుట్టిన మాలతీ చందూర్ గారి వల్లే లక్షల మంది తెలుగు పాఠకులకి ఎందరో విఖ్యాత ఇంగ్లీషు రచయితలు పరిచయమై పుస్తకాలు చదవడంలో ఆసక్తి కలిగింది.
నూజివీడు , ఏలూరులలో చదువుకున్న ఆమెకి అక్కడ ఉన్న ‘కథావీధి’సాహిత్య పత్రిక వల్ల శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన దిగ్గజాలని చూడడం జరిగింది. అప్పటి రీతిలో ఆమె కి 17వ ఏటే చందూర్ తో వివాహం జరిగి మద్రాసుకు వచ్చి ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్‌సి పూర్తి చేశారు.
1949 నుంచి రేడియో లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. అప్పుడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్, ముని మాణిక్యం నరసింహారావు లాటి పెద్ద రతయితలు పరిచయమై ఆమె పత్రికలలో రాయడం మొదలెట్టారు..
1952 నుంచి రచనా వ్యాసంగం లో తీరిక లేకుండా గడిపారు. ఆగస్టు 21, 2013 తేదీన మాలతీ చందూర్ చెన్నైలో మరణించారు. ఆంధ్రప్రభ పత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ‘ప్రమదావనం’ శీర్షిక మొదలు పెట్టి 20 ఏళ్ళు నడిపారు. 1952నుంచి వారి రచనలు కొత్త శిఖరాలు అందుకున్నాయి. వంటలు, స్త్రీల సమస్యలు, ప్రఖ్యాత ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలు తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చాలా చేసేరు… ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే శీర్షిక ఎంతో మందిని ఆకర్షించింది.. ఈమె వంటల పుస్తకాలు ‘జవాబులు’ శీర్షిక ఎందరో ఏళ్ళకొద్ది దాచారు.
ఎన్నో మహిళా ప్రధాన తెలుగు నవలలు కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను, జేన్ ఆస్టిన్ నుండి ఈనాటి అరుంధతీ రాయ్ రచనల వరకూ అనువదించారు. .ఆవిడికి ఎన్నో పురస్కారాలు దొరికాయి. కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా ఆమె చూసిన తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి పెద్దవయసులో తమిళ భాష నేర్చుకున్నారు. అనేక తమిళ రచనలను కూడా అనువదించారు. హృదయనేత్రి నవలకు 1992లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
(వికీ బుక్స్ సౌజన్యంతో)