తెలుగు తల్లికి మరొకరి పూదండ..
“తమనితామే కించపరుచుకోడం మరొకరిని అనుసరించడం తెలుగు వారి ప్రత్యేకత కదా?” అనడం కూడా అదే కోవకి చెందినదని తెలుసు, కాని ( ad లో లా) ఈ ‘మరక మంచిదే’. ఎన్నోతరాలుగా ముంబయిలో ఉంటూ మరాఠీ రాని వారు అలాగే హైదరాబాద్ పాత సిటీలో ఉర్దూ మాత్రమే మాట్లాడం జాతీయ సమైక్యతకి చేస్తున్న హాని తెలిసినదే. మొదటి దానివల్ల శివసేన పుట్టింది. రెండవదాని వల్ల MIM, దేశద్రోహం పుడుతున్నాయి. నిజాం పాకిస్థాన్ లొ చేరే పథకాన్ని విరోధించడం వల్ల అతి క్రూరంగా హత్యేఅయి చేతులు నరక బడిన షోయబుల్లా ఖాన్ అనే 20 ఏళ్ళ పత్రికా సంపాదకుడి శతవార్షికోత్సవాన్ని ఈ నెల తెలంగాణా ప్రభుత్వం పాతనగరంవారికి కోపమొస్తుందనే భయంతోనో MIM విరోధం వల్లో మానుకుంది.
కాని తెలుగువారు స్థానీయులతో కలిసిపోయితారు. ఎక్కడా national integrationకి భంగం కలిగించలేదు. మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి పదవికి మారుత్రావ్ కన్నంవార్ ఆనే తెలుగురాని తెలుగుమనిషి ఎంపిక అయాడు. అతని భార్య “కొంచెం కొంచెం” తెలుగొచ్చిన గోపికాతాయి మహరాష్ట్ర కాoగ్రెస్ కి అద్యక్షురాలయింది.
మన రాష్టానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ (మార్క్స్ వాది) ఇప్పటి దళాధిపతి యేచూరి సీతారామ్ ఉత్తర భారతీయుల కన్నా మంచి హిందీ మాట్లాడుతూ 1966 లో ఒక పత్రపరిషత్తులో తెలుగు సామెత వాడితే “మీకు తెలుగు ఎలా వచ్చు?” అని (యేచూరి తెలుగు ఇంటిపేరని తెలియని) నేను అడిగాను. “నేను తెలుగువాడినయ్యా” అని అతను జవాబిస్తే ఆశ్చర్య పడిన (అప్పటి వరకూ తెలుగు గడ్డ మీద కాలు మోపని) మూర్ఖడి నయ్యాను.
అలాగే ఇంగ్లీషులో news readersలో సర్వోత్తముడు అనిపేరు పడిన J.V.Raman అసలుపేరు జోష్యుల వెంకట రమణ అని చాలామందికి తెలియదు. ఢిల్లీ మహారాష్ట్ర మండల్ కి నాసలహాపై పిలవ బడిన PV నరసింహారావు చక్కని మరాఠీలో ఉపన్యాసం ఇస్తే అతను నాగపూరులో చదువుకొని మరాఠీ నేర్చుకున్న విషయం అక్కడివారికి తెలియదు.
ఇద్దరు తెలుగువారు కలిస్తే ఇంగ్లీషులోనో హిందీలోనో మాట్లాడుకుంటారన్నది నిజమైనా వారు తెలుగు చదవలేకపోడం మాత్రం విచారించ వలసిన విషయం. తెలుగువారికే తెలుగు నేర్పడానికి ఒక ఉద్యమం నడపాలని రెండు తెలుగు రాష్టాల.నాయకులకూ తట్టలేదు. (ఎన్నోఏళ్ళు తెలుగతను రిషీకేష్ శర్మ నడిపిన) రాష్ట్రభాషా ప్రచార సమితిలా అవి దేశ వ్యాప్తంగా పరీక్షలు ఎందుకు నడపకూడదు? తెలుగు యూనివర్సిటీ (హైదరాబాద్) రాజకీయ కీచులాటల కోసం మాత్రమేనా?
పైరాష్టాలలోనూ పైదేశాలలోనూ తెలుగు నేర్పడానికి ముందడుగు వేసినది ‘పాఠశాలా ఇంకార్పొరేటెడ్’ అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ (non-profit), తెలుగు రాష్ట్రాలు కాదు.
ఇక అనుకరణ విషయం. తెలుగు రాష్ట్రాలలో దేశనాయకుల పేర్లు. జాతిసూచక ఇంటిపేర్లతో సహా పెట్టుకోడం మామూలే. నేతాజీ భక్తులు సుభాష్ పేరు పిల్లలకీ పెట్టడం సహజమే కాని సుభాష్చచంద్ర బోస్ కాదు. బోస్ ఇంటిపేరు. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఒక రౌడీ పేరు గాంధీ ఐతే మరొక గుండా నెహ్రూ… రెండూ ఇంటిపేర్లే. ఇలాగే బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే కూడా. మరే భాషవారూ మన కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, టంగుటూరి, గరజాడ, లేక పొట్టి శ్రీరాములు పేర్లు పెట్టుకున్నారా?
“మనవాడు బాగు పడి పోతున్నాడురా” అని గట్టిగా ఏడిచి వాడిని వెనక్కి లాగడం, పెద్దహోదాలో ఉంటే మరొక తెలుగు వ్యక్తి రాకుండా చూడం మనకి మామూలే. ఈ నల్ల మేఘానికి silver lining ఒకటే… ఏ రాష్ట్రంలోనూ తెలుగు విరోధ ఉద్యమం లేదు.
‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ మధుర గీతం రాసినది ఒక తమిళ మూలపు అయ్యంగార్. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్నది ఒక తులు భాషీయుడైన కన్నడ చక్రవర్తి. .ఇదే తెలుగువారి గొప్పతనం… వారి నీరసత్వం కూడా.
It is both a strength and a weakness at the same time!