www.theTelugus.com

ఏ దేశ మేగినా‌, ఎందు కాలిడినా…

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు కవి గురజాడ అప్పారావు (ఎవరూ? ఏ సినిమాకి పాటలు రాసేడు? అని అడగకండి) గారి పద్యంతో తన  ఉపన్యాసం  మొదలెట్టి ఈ దేశంలో 22 ముఖ్య భాషలూ వందల ప్రాంతీయ భాషలూ ఉన్నాయన్న విషయం మరొక సారి మనకి గుర్తుచేసేరు.

రాజకీయ నాయకులకు ఎక్కడికెళితే అక్కడి భాషతో తమ భాషా మొదలు పెట్టడం‌ అలవాటే – ఆప్రాంతంవారితో తమ   సాన్నిహిత్యం ప్రదర్శించడానికి. నెహ్రూ, ఇందిరా ‘గాంధీ’ ఈ ‘trick’ వాడేవారు. శాస్త్రి మాత్రం వాడినట్టు జ్ఞాపకం లేదు. బహుశా ఎలాటి  భ్రమా కలిగించడం అతనికి అలవాటు లేదేమో.

మోదీ (తెలియని తెలుగు డినేశ్, డింకర్లకి ‘మోడీ’) తెలుగు పద్యం చదవటం దోషితమై ఉండొచ్చు. తెలియని భాష వాడినప్పుడు అది సహజమే. తెలిసిన భాషయినా ఉచ్చారణ వేరు కావచ్చు. తెలుగు ఐతే ఎక్కడ వాక్యం విరవాలో ఎక్కడ ఆగి చెప్పాలో తెలియక పోతే ‘రాముని తోక,  పివరుడు’  ఏమి చెప్పేడో  తెలియక నవ్వులపాలౌతాం. మొదటి ప్రపంచ తెలుగు సభ ప్రారంభం చేస్తూ ఉప రాష్ట్రపతి బి. డి. జట్టి  ఆతి  చక్కటి  (రమాదేవిగారు రాసిన) భాషణలో ఐనట్టుగా.  మోదీ తెలుగులో అనడం ముఖ్యం‌, ఆతని ఉచ్చారణ కాదు. 

గురజాడ అన్నట్టుగా మనంపైభాష నేర్చుకోడంలో స్వంతలాభం ‘కొంత’ మానుకుంటాం. అతను చెప్పినట్టు దేశమంటే మట్టికాదు – దేశమంటే మనుషులు. మనిషి మాట్లాడే జంతవు. అతనికి ( అంటే ఆమెకు కూడా) భాష ఉంటుంది. జంతువులకీ‌, పక్షులకీ ‘భాష’ పౌరాణిక కధలోనే ఉంటుంది. నిజంగా ఉంటుందో లేదో ఈ తెలివిలేని dumb రెండు కాళ్ళ పశువులకి తెలియదు. 

మాములుగా 99% మనుషులు స్వార్ధంకోసమే మరొక భాష నేర్చుకుంటారు —  వారి వ్యాపారం కోసమో, ‌ఉద్యోగం కోసమో, పైరాష్ట్రాలలో  ఉంటే  దైనందిన అవసరాలకో.  తమ మాతృభాష లాగే తక్కిన భాషలకి కూడా చక్కటి, సాహిత్యం, సంస్కృతి, గొప్ప చరిత్ర ఉండవచ్చని అవసరం లేకపోయినా ఆ భాష.నేర్చుకోవాలని ఎంతమంది అనుకుంటారు?  ఎన్నో దశాబ్దాలలో ఒకే ఒక  మనిషి – ఢిల్లీలో ఒక బిహారీ పత్రకర్త – నాకు తెలుసు. హిందీలోకి తర్జుమా  ఐన  మాస్తి వెంకటేష్ అయ్యంగార్ రాసిన ఒక కధ నచ్చి అతని రచనలు మూలరూపంలో చదవాలని అతను కన్నడ నేర్చు కున్నాడు.

నెల్లూరులో పుట్టిన ఆంధ్ర  పూర్వ ముఖ్యమంత్రి  బెజవాడ గోపాల రెడ్డిని  కలిసినప్పుడు అతనూ‌, అతని భార్యా, శాంతినికేతన్ లో చదివేరనీ, మహాకవి రవీంద్రనాథ్ టాగూర్ వల్ల ప్రభావితం అయి అతను బెంగాలీ నుండి ఎన్నో తర్జుమా చేసేరనీ తెలియదు. శరత్ సాహిత్యం యొక్క  ప్రభావం తెలుగు రచయితల మీద ఎంత ఉందో తరవాత తెలిసింది.  

మరొక ప్రాంతంలో పుట్టి పెరిగినవారు స్థానిక జీవితంతో కలిసిపోడం మామూలే. కర్ణాటకలో పుట్టీ పెరిగిన లక్షల మంది తెలుగు వారు తమ మాతృభాష కన్నడ మనే చెపుతారు – విదర్భలోని ‘వారు’లంతా మరాఠీయే వారి భాష అని చెప్పినట్లు. కన్నడ  తమ భాష అనుకునే తెలుగు వారిలో ప్రపంచ  ఖ్యాతి  చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య,  జ్ఞానపీఠ్ పురస్కారం  పొందిన డి.వి..గుండప్ప‌‌, పేరుపడ్డ Astrological Magazine of India సంపాదకుడిగా పేరు పొందిన బి.వి. రామన్ ఉన్నారు.

ప్రతి భాషా గొప్పదే. మోదీ గుజరాతి వాడై, తెలుగులో చెప్పడం (ఒక సంబోధన మాత్రం కాకుండా) చాలా గొప్ప విషయం. భాషల  వైరుథ్యాన్ని ఎత్తి చూపి, ద్వేషం పుట్టించి రాజకీయ స్వార్థం  గడుపుకునేది  నాయకులే,  ప్రజలు కాదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here