www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -7 By Someswar Bhagwat

పేర్లు సరిగాలేకపోతే నవ్వులపాలు, జాగ్రత్త

చిన్నప్పటి ఓ జోకు  గుర్తుందా? వరండాలో  తచ్చాడతున్న   పిల్లల్నీ   చూసి  ఒక   బెంగాలీ హెడ్డ్మాస్టరు అంటారు: భైఆర్యూ  భాన్డరింగ్  ఇన్ దీ భరాండా? ఇలాగే తెలుగు వారిని ‘కము హియరు’ అని పిలుస్తారు. ఇవి వేరు వేరు  బాషలలో ఉఛ్ఛారణ మారుతూ ఉండటం వల్ల వచ్చేయి. హిందీలో ‘పరివర్తన్’ తెలుగులో ‘పరివర్తన’  ఐతే బెంగాలీ లో ‘పొరిబొర్తన్’ అవుతుంది  మహాశయ  ‘ మోషై’ ఐనట్టే.

కాని అన్ని దినపత్రికలకీ వార్తా సంస్థలు వార్తలు ఇంగ్లీషులో   (ఈ మధ్య హిందీలో కూడా), పంపుతారు.  ప్రాంతీయ భాషల వారు తర్జుమా చేసుకోవాలి  దానికి రెండు భాషలూ బాగా రావాలి.

ఇంగ్లీషు సబ్ఎడటర్లు సులభంగా  అక్షరం కింద రెండు గీతలు గీసి capitals సూచిస్తే‌,  భాషాపత్రకారులు ప్రతి వాక్యాన్నీ బోథపరుచుకుని తర్జుమా చెయ్యాలి. ఐనా వారికి  ఇంగ్లీషు పత్రకారులకంటే జీతాలు తక్కువ!. మన బానిస మనస్తత్వం  (slave mentality) ఉదాహరణ  ఇది.

ఈ సమస్య ఎదురయేది మరొక విషయంలో  కూడా.   ప్రతి మనిషీ స్వయంగా తనపేరు ఎలా రాసుకుంటారో అదే సరైన పధ్ధతి.  (50 ఏళ్ళకింద రాజ్ నారాయణ్ ని   తన  పేరు  spelling   అడిగితే – కొందరు Narayan రాస్తే    మరికొందరు   Narain   రాస్తారు కాబట్టి —  అతను  నానోట్ బుక్ తీసుకుని రాసిచ్చారు – హిందీలో! (అతను లోహియావాది, ఇంగ్లీషు విరోధి). సరైన spellingకి ఓ  ఢిల్లీ పత్రిక చూడవలసి వచ్చింది.

పాతికేళ్ళ కన్నా ఎక్కువ ప్రజా జీవితంలో ఉన్న నరేంద్ర మోదీ పేరు ఇప్పటికీ కొన్ని ప్రాంతీయ భాషల పత్రికల్లోనూ న్యూస్ చేనళ్ళలోనూ ‘మోడీ’ గానే చలామణౌతున్నాది! కొందరైతే ఎన్నిసార్లు చెప్పినా తాను  పట్టిన కుందేలికి మూడే కాళ్లు అనుకుని సరిచేయడానికి  నిరాకరిస్తున్నారు. 

 ఇలాగే దక్షిణ ప్రాంతాల్లో లతా (Lata) అనే  పేరుని లథా (Latha) అని రాస్తారు. అది స్థానిక వ్యక్తి ఐతే సరే‌ కాని లతా మంగేష్కర్ ఐతే తప్పు. ఈజాగ్రత బాధ్యత సబ్ఎడిటర్ దే. ఇవి తెలియడానికి పరప్రాంత పత్రికలు చదవటం అలవాటు అవాలి.

అలాగే ఈమథ్య వార్తలలో ఉన్న ముంబై పోలీసు సచిన్ వాఝే పేరు ‘వఝే’ (Vaze)  అని     రాస్తున్నారు. Vaze  మహరాష్టలో బ్రాహ్మణ పేరు Waze మరాఠా కులం. అలాగే గుజరాత్ లో పారేఖ్‌, పారీఖ్ వేరు వేరు కులాలవారు కావొచ్చు. ఒకరు బనియా‌ మరొకరు జైన్. మరాఠీ మహదిక్ కి బదులు బెంగాలీ మధోక్  రాసినా చికాకే. 

మనం ఎంత వద్దనుకున్నా కుల వ్యవస్థ హిందూ.సమాజంలో పాతుకుపోయింది. ఆ పేర్లవారికి పట్టింపు ఉండవచ్చు. Mane అని రాస్తే ఎవరేనా మేన్.అని చదువుతారు‌ కానీ అది మరాఠీ/కన్నడ.పేరు మానే. ఆభాషల్లో ఎన్నో పేర్లు e తోపూర్తైనా వాటిని ఏ తోపలకాలి. ఈ సమస్య భాషా పత్రకారులదే.  ఇంగ్లీషు పత్రికలవారు  పేరు మొదటి అక్షరం కింద రెండు గీతలు  పెట్టె capital అని  సూచిస్తే చాలు.

 కొన్ని జర్మన్, ఫ్రెంచ్‌, ఇంకా ఎన్నో భాషల వారి పేర్లు రాసిన విధానికీ ఉఛ్ఛారణకీ చాలా వ్యత్యాసం ఉంటుంది. సరైన విధానం తెలుసుకోడానికి ప్రయత్నం చెయ్యాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here