ఇంతే సంగతులు
అమ్మ చెప్పిన బుధ్ధులు ఆఖరి దాకా ఉంటాయి
By Someswar Bhagwat
చిన్నప్పుడు చదువుకున్న పద్యాలలో ఒకటి “ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్” అని (తక్కిన భాగం మరిచి పోయాను)
ఆడవారు ఫైటర్ బాంబర్లు, నౌకలు నడుపుతున్న ఈ రోజున వారడగవచ్చు “నేర్పడానికి నువ్వెవడివి? బెత్తానికి స్వస్తి చెప్పేం కనక చికాకు పడుతూ ఐనా నేర్పేవారు స్త్రీలు (ముదితలు) కదా ?” అని.
ఇప్పుడు విద్య నేర్పేది చాలా మటుకు స్త్రీ లే. యాభై ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ క్లాస్ లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉన్నట్టు ఇప్పుడు బి.ఎడ్ క్లాస్ లో చాలా తక్కువ మొగపిల్లలు ఉండవచ్చు. ఆడవారు సహజంగా మంచి టీచర్లు. ప్రతి వ్యక్తికీ మొదటి గురువు తల్లే కదా? అమ్మ చెప్పిన బుధ్ధులు ఆఖరి దాకా ఉంటాయి అంటారు. జీవితం ఆఖరి రోజుల్లో తలుచుకునేది తల్లినే. మొట్ట మొదట నేర్చిన భాషని మాతృభాష అంటారు కానీ పితృ భాష లేక దేశభాష అనరు.
దసరా పాటల్లో “అయ్యగారికి చాలు ఐదు వరహాలు” . చాలినా లేకపోయినా అయ్యగారి mrp ఐదు వరహాలు, కానీ ఆమ్మగారు priceless.
ఆడవారికి రాని విద్యా, కౌశల్యం (skill) ఈప్రపంచంలో లేదు. రచయితలుగా నటులుగా, వైజ్ఞానికులుగా, వారు రాణించారు మగవారు చేసే ప్రతి పనీ స్త్రీలు చెయ్యగలరు కొన్ని వారికంటే బాగా కూడా. కాని ఆడవారిలా మొగవాడు పీల్లలని కనలేడు. నెలలు మోసి, మృత్యువు తో తలపడి మరో మాటు జీవితం పొంది మరో జీవికి ప్రాణం పోసి పెంచడం ఒక స్త్రీ మాత్రం చెయ్యగలదు.
స్త్రీ తల్లే కాదు సహజ గురువు. ఆడవారికి అన్నిటికన్నా మంచి వృత్తి విద్య నేర్పడం.మాతృ దేవో భవ గురుర్ దేవో భవ.